రంజన్ గొగోయ్: రాష్ట్రపతులతో ప్రమాణ స్వీకారం చేయించే పదవి నుంచి రిటైరయ్యాక రాజ్యసభ ఎంపీగా..
భారత ప్రధాన న్యాయమూర్తి పదవి నిర్వహించిన వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం కావలసి వచ్చిందా? రంజన్ గొగోయ్ మీకిది తగునా?
రాష్ట్రపతి పదవికి ఎన్నికైన వ్యక్తితో ప్రమాణ స్వీకారం చేయించగల సమున్నత అధికార హోదా భారత ప్రధాన న్యాయమూర్తికి ఉంటుంది.
అలాంటి పదవి నుంచి రిటైరైన రంజన్ గొగోయ్‌ను రాజ్యసభ సభ్యుడిగా నియమించాలని రాష్ట్రపతి నామినేట్ చేశారు. దీంతో ఇప్పుడాయన ఎంపీ రంజన్ గొగోయ్‌గా మారుతున్నారు. మరి, రంజన్ గొగోయ్ పేరు ముందు ఇప్పుడు జస్టిస్ అనే గౌరవవాచకం ఉంచాలో వద్దో భారత రాజ్యాంగం చెప్పలేదు.
రంజన్ గొగోయ్ వంటి ప్రధాన న్యాయమూర్తి భారత దేశ న్యాయవ్యవస్థను పరిపాలిస్తాదని గానీ, తన పదవీకాలం ముగిసే ముందు అత్యంత కీలకమైన కేసులలో తానే స్వయంగా ధర్మాసనాలలో కూర్చుని తీర్పులిస్తారని గానీ, ఆ తరువాత నాలుగు నెలల్లోనే రాజ్యసభకు ఆయన నామినేట్ అవుతారని కానీ రాజ్యాంగ నిర్మాత భీమ్ రావ్ అంబేడ్కర్ కూడా ఊహించి ఉండరు.
జస్టిస్ రంగనాథ్ మిశ్రా
రంగనాథ్ మిశ్రా నుంచి రంజన్ గొగోయ్ వరకు..
ఏలిన వారి దయతో, ప్రధాని కరుణతో పదవి సంపాదించిన ప్రముఖ ప్రధాన న్యాయమూర్తుల కోవలో రంజన్ గొగోయ్ మొదటివారు కాదు. ఎందుకంటే ఇటీవలే కేరళ గవర్నర్‌గా సకల అధికార సౌఖ్యాలు అనుభవించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి సదాశివంను జనం అంత తొందరగా మరిచిపోలేదు.
అంతకుముందు రంగనాథ్ మిశ్రా పదవీ విరమణ చేసిన ఏడేళ్ల తరువాత ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యసభకు పోటీ చేయడానికి టికెట్ ఇచ్చి, ఎమ్మెల్యేల ద్వారా గెలిపించిన విషయం కూడా గుర్తుండే ఉంటుంది.
జస్టిస్ బహరుల్ ఇస్లాం అనే సుప్రీంకోర్టు జడ్జిగారు సుప్రీంకోర్టుకు రాజీనామా చేసి రాజ్యసభకు పోటీ చేసి 1983లో కాంగ్రెస్ టికెట్ పైన గెలిచారు.
ఇటీవల మరణించిన బీజేపీ నేత అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న 2012 కాలంలో న్యాయమూర్తులు పదవీ విరమణ రెండేళ్ల వరకు ఏ పదవులూ చేపట్టరాదని.. వారికి ప్రభుత్వాలు ఏ పదవులూ ఇవ్వరాదని వక్కాణించారు. కనీసం ఆ నియమాన్నీ కూడా బీజేపీ పాటించలేదు. చేసిన సేవలు రెండేళ్ల తరువాత గుర్తుపెట్టుకుని పదవులిచ్చే కృతజ్ఞత ఎవరికీ ఉండదన్న నమ్మకంతో రంజన్ గోగోయ్ వెంటనే అంగీకరించి ఉంటారు.
అప్పట్లో మాజీ ప్రధాన న్యాయమూర్తికి ధన్యవాదాలు తెలియజేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు భావించిందో.. ఇప్పుడు రంజన్ గొగోయ్‌కి బీజేపీ ప్రభువులు ఆయన పదవీ విరమణ చేసిన నాలుగు నెలల్లోగానే కృతజ్ఞత ఎందుకు ప్రకటించారో తెలియదు.
న్యాయవ్యవస్థను కావాలని భ్రష్టు పట్టించడానికి పాలకులు ప్రయత్నిస్తారనడానికి కాంగ్రెస్ పాత సాక్షి అయితే బీజేపీ తాజా తార్కాణం. తనకు బుద్ధిచెప్పగల ఏ వ్యవస్థను పాలకుడు బతకనీయకపోవడంలో దొందూదొందే అని కాంగ్రెస్, బీజేపీ నిస్సిగ్గుగా చాటుకున్నాయి.
త్రిసభ్య కమిటీ విచారణకు హాజరుకాను: సీజేఐ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ
సీజేఐ గొగోయ్ మీద లైంగిక ఆరోపణలు: ఈ కేసు #MeToo కంటే పెద్దది. ఎందుకంటే..
సామాజిక మాధ్యమాల్లో
మోదీ-అమిత్ షా ప్రభుత్వం ఇంత తొందరగా పదవి ఇవ్వడం ద్వారా ధన్యవాదాలు చెప్పుకునేంతగా గొగోయి గారు చేసిన అత్యంత విలువైన సేవలేమిటో పత్రికా విలేకరులు, సామాజిక శాస్త్ర విద్యార్థులు, న్యాయశాస్త్ర విద్యార్థులు పరిశోధించవలసి ఉంది. కాని అంతవరకు జనం ఆలోచనలు ఆగవు కదా.
ముఖ్యంగా సామాజిక మాధ్యమాలలో గొంతు విప్పి మెదడు మన ముందు పరిచే చైతన్యవంతులైన యోచనాపరులైన పౌరులు ఇది ఏవేవో సానుకూల తీర్పులకు ప్రతిఫలమై ఉంటుందనీ, లీడర్లతో కుదిరిన డీల్ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు, సచిత్రంగా వ్యాఖ్యానిస్తున్నారు కూడా.
రంజన్ గోగోయ్ చాలా సంచలన తీర్పులు ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తి. సీబీఐ అలోక్ వర్మ కేసులో విచిత్రంగా వ్యవహరించారు. తరువాత సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీలో ప్రధానితో పాటు కూర్చున్నారు. ఏదో అనిపించి ఆ కమిటీనుంచి తప్పుకొన్నారు.
రఫేల్ కుంభకోణంలో ప్రభుత్వం తప్పులేదని తీర్పు చెప్పారు. ఎలక్టోరల్ బాండ్స్ అనే దారుణమైన రాజకీయ అవినీతి పథకంపై కేసులు వినకుండా వాయిదా వేసి శభాష్ అనిపించుకున్నారు.
కశ్మీర్‌లో అక్రమ బందీల హెబియస్ కార్పస్ కేసులు వినకుండా సర్కారుకు అభయం ఇచ్చారు. రాజ్యాంగం, న్యాయసూత్రాలు కూడా ఊహించని రీతిలో అయోధ్య వివాదంపైన వింత తీర్పు ఇచ్చారు. అస్సాంలో ఎన్‌ఆర్‌సీ తయారీ గందరగోళానికి సుప్రీంకోర్టు పర్యవేక్షించింది. అందులో అస్సాంకు చెందిన రంజన్ గోగోయి గారికి కీలకపాత్ర. సర్కారు వారికి అత్యంతప్రియమైన ఎన్నార్సీని దేశం మొత్తానికి విస్తరించే ఊపునిచ్చిన పాత్ర.
‘కులాంతర వివాహం చేసుకుంటే టెర్రరిస్టుల్లా చూస్తున్నారు’
జస్టిస్ రంజన్ గోగోయ్: సొంత కారు లేని సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్
ఆ నీతులేమయ్యాయి?
విచిత్రమేమంటే గొగోయ్ అధ్యక్షత వహించిన ఒక ధర్మాసనం రోజర్ మాథ్యూ ్లో ఉన్న వ్యక్తులకు రిటైర్మెంట్ తర్వాత పదవులు ఇవ్వడం వల్ల వారి న్యాయస్వతంత్రతపై దుష్ప్రభావం ఉంటుందనీ, దీని వల్ల ప్రజలలకు న్యాయవితరణ విధానంపైన విశ్వసనీయత సడలిపోతుందని, న్యాయపాలనలో ప్రభుత్వ పాలకుల అనవసర జోక్యానికి దారి తీస్తుందని నీతి సూత్రాలు చెప్పింది.
తనపైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మహిళను డిసెంబర్ 2018లో ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేయడం, సుప్రీంకోర్టు కుటుంబ పెద్ద అయిన న్యాయపాలకుడుగా గొగోయి తీసుకున్న స్వయం నిర్ణయం. తన కేసులో తానే తీర్పు చెప్పుకున్నంత స్థాయిలో తానే బెంచ్‌పై ఉండడం. తానే జడ్జిలను ఎంపికచేయడం, తాను నిర్దోషిగా బయటపడడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం ఆయన కెరీర్‌లో వివాదాస్పద అంశాలు.
ఆయన సీజేఐ పదవి వదిలిపెట్టిన కొన్నాళ్ళకు ఆయనపై ఆరోపణలు చేసిన ఆ మహిళకు జనవరి 23, 2020న ఉద్యోగం మళ్లీ ఇచ్చారు.
లోబరుచుకునే కుట్ర
పాలకులు న్యాయమూర్తులను, విరమణానంతర పదవుల లాలసత్వంతో లోబరుచుకోవడానికి చాలా నిశ్శబ్దంగా చట్టాలను నిర్మిస్తారు. అవి అల్లిన కుట్రల వలె కనిపించవు.
లోక్ పాల్, లోక్ అయుక్త, జాతీయ, రాష్ట్ర స్థాయి మానవ హక్కుల కమిషన్లు, లాకమిషన్ ఆఫ్ ఇండియా వంటి అనేక పదవులతో పాటు, రాజ్యసభ సభ్యత్వం, గవర్నర్ పదవి కూడా సిద్దంగా ఉంచుకున్నారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అందుబాటులో లేకుంటే దేశాధ్యక్ష బాధ్యతా సీజేఐదే.
రాష్ట్రపతికి కూడా పదవీ ప్రమాణం చేయించే ఉన్నతమైన పదవి ప్రధాన న్యాయమూర్తి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా లేని పరిస్థితి వస్తే దేశాధ్యక్ష పదవిని తాత్కాలికంగా నిర్వహించే బాధ్యత కూడా ప్రధాన న్యాయమూర్తికి ఉంటుందని రాష్ట్రపతి విధుల నిర్వహణ చట్టం 1969 నిర్దేశిస్తున్నది.
అంతటి పదవిలో ఉన్న వ్యక్తి ఆ రాష్ట్రపతినియమించే ఒక సభ్యత్వాన్ని ఆశించడం ఆశ్చర్యకరం.
ఏ వ్యవస్థ అయినా నమ్మకం మీద బతుకుతుంది. రాజకీయ పార్టీకూడా ప్రజల నమ్మకం ఆధారంగానే ఎన్నికలు గెలుస్తుంది. దాన్ని విశ్వసనీయత అంటారు. న్యాయవ్యవస్థ పట్ల ప్రజలకుండే విశ్వాసాన్ని గౌరవాన్ని, ప్రేమను, నమ్మకాన్ని భారీ ఎత్తున తగ్గించే చర్య ఈ నియామకం.
ప్రజాస్వామ్యరాజ్యాంగ వ్యవస్థలో న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య కావలసినంత దూరం ఉండాలని రాజ్యాంగ నిపుణులు ఘోషిస్తున్నారు. అధికారాల వేర్పాటు అనేది ఫెడరల్ రాజ్యాంగ మౌలిక సూత్రం. ప్రధానమంత్రి, ప్రధాన న్యాయమూర్తి ఎక్కడైనా యాదృచ్ఛికంగా కలుసుకుంటే అది వేరు విషయం. మరో రకంగా వారు ఒక చోట సమావేశం కావడానికి కూడా రాజ్యాంగ సంప్రదాయాలు అంగీకరించవు. ఆ కలయికలు అనుమానాలకు దారితీస్తాయి.
న్యాయ లీడర్, పాలక లీడర్ డీలర్లు కాదని జనం ఇంకా నమ్ముతున్నారు. ఆ నమ్మకానికి పునాదులు ధ్వంసం చేయకూడదనే విషయం నరేంద్ర మోదీ, రంజన్ గొగోయి మరిచిపోవడం, వారికి మరెవరూ చెప్పకపోవడం దురదృష్టకరం.
ప్రధాన న్యాయమూర్తి పదవిలో ఉన్నప్పుడు విరమణ తరువాత కూడా ఆ వ్యక్తిపైన బాధ్యతారహితమైన విమర్శలు వ్యాఖ్యానాలు చేయకూడదనే నీతిని చాలా మంది పాటిస్తారు. కాని ఒక్కసారి ఎంపీ పదవికి ఆశపడిన మాజీ ప్రధాన న్యాయమూర్తిని నానా రకాలుగా విమర్శించే అవకాశం కలుగుతుంది. ఆ విధమైన వ్యాఖ్యలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. అందువల్ల న్యాయవ్యవస్థమీద ఉన్న గౌరవం క్షీణించి అందులో పనిచేసే నీతివంతులైన న్యాయమూర్తులకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి.
ఈ దేశంలో ఇప్పటికీ బతికి ఉన్న వ్యవస్థ, కొనఊపిరితోనైనా కొట్టుకుంటున్న వ్యవస్థ ఏదైనా ఉంటే అదే న్యాయవ్యవస్థ. ఇప్పటికైనా బాధ తీర్చి పరిహారం కలిగించే వ్యవస్థ ఏదైనా ఉంటే అది న్యాయవ్యవస్థ ఒక్కటే. దానికి కూడా ఇటువంటి పరిస్థితి వస్తే న్యాయానికి దిక్కెవరు? పదవులు పడేసి పనులు చేయించుకుంటాం, వ్యతిరేక తీర్పులిస్తే న్యాయమూర్తులను బదిలీ చేస్తాం అనే నాయకులు... పదవులు తరువాత ఇస్తారనే ఆశతో పాలకులు చెప్పింది చేస్తాం అనే వ్యక్తులు ఉంటే మామూలు ప్రజలకు ఇక దిక్కేమిటి?
( రచయిత న్యాయశాస్త్ర ఆచార్యులు, మాజీ కేంద్ర సమాచార కమిషనర్. )
(మాడభూషి శ్రీధర్
బీబీసీ కోసం
17 మార్చి 2020)