ఈ రాత్రికి ప్రధాని మోదీ సంచలన ప్రకటన… ‘‘అన్నీ బంద్!’’ #health_emergency
నోట్ల రద్దు తరహాలో మరో సంచలన ప్రకటనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సిద్దమవుతున్నారా? గురువారం రాత్రి ఎనిమిది గంటలకు మోదీ జాతినుద్దేశించి ప్రకటన చేయనున్నట్లు చెప్పినప్పట్నించి మోదీ నిర్ణయం ఏమై వుంటుందా అన్న చర్చ ఊపందుకుంది.
యావత్ ప్రపంచం కరోనా వైరస్‌తో గడగడలాడిపోతున్న తరుణంలో మన దేశంలో మరిన్ని పకడ్బందీ చర్యలను తీసుకునేందుకు రెడీ అవుతోంది మోదీ ప్రభుత్వం. అందుకే గురువారం ప్రధాన మంత్రి మోదీ దేశ ప్రజల ముందుకు వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దేశంలో ఆరోగ్య అత్యవసర స్థితి (హెల్త్ ఎమర్జెన్సీ) ప్రకటించేందుకు మోదీ సిద్దమవుతున్నారని చెబుతున్నారు.
యావత్ దేశ ప్రజలకు గుర్తుండిపోయిన ఘట్టం.. 2016 నవంబర్ 9 రాత్రి 8 గంటలకు ప్రధాన మంత్రి ఇలాగే దేశ ప్రజలకు ఓ సంచలన నిర్ణయం పెద్ద నోట్ల రద్దుతో సందేశమిచ్చారు. సరిగ్గా ఇపుడు అదే లెవెల్‌లో పెద్ద నిర్ణయంతో మరోసారి మోదీ దేశ ప్రజల ముందుకు వస్తున్నారని తెలుస్తోంది. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ పేరిట.. ఒక్క నిత్యావసరాలు తప్ప మిగితాదంతా బంద్ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోందని తెలుస్తోంది.
ముందుగా గురువారం రాత్రి ఈ ప్రకటన చేసిన తర్వాత ప్రధాన మంత్రి శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు దేశంలోని అందరు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి… పరిస్థితిని రివ్యూ చేస్తారని, కీలక సూచనలు రాష్ట్రాలకు చేస్తారని తెలుస్తోంది. కొన్నాళ్ళ పాటు… అన్ని రకాల ప్రయాణాలు రద్దు చేస్తారని అంటున్నారు. ఒక్క నిత్యావసరాల దుకాణాలు మినహా.. అన్ని రకాల వ్యాపార, వాణిజ్యాలను కొంత కాలం పాటు నిలిపి వేసేలా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.
పెద్ద నగరాలలో 144 సెక్షన్ విధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మొత్తమ్మీద దేశంలో ఓ అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ)ని ఏర్పాటు చేయడం ద్వారా 15 రోజుల పాటు పూర్తి స్థాయిలో నియంత్రణ అమలు చేస్తే.. మన దేశంలో కరోనాను మరింత వ్యాపించకుండా చేయొచ్చన్నది కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.