podupu yela

కూరగాయలు లేవనీ, దొరకటం లేదని టెన్షన్ పడొద్దు .ఒక్కసారి మీ చిన్నప్పటి విషయాలు గుర్తుకు తెచ్చుకోండి .చక్కగా కందిపప్పు వేయించి పప్పు వండి ,చారు పెట్టండి. లేకపోతే పప్పు పులుసు, పప్పు చారు చెయ్యండి .రెండు పూటల కీ సరిపోతుంది .బంగాళాదుంపలు వేపుడు చేస్తే పిల్లలు పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. లేకపోతే రెండు ఒడియాలు వేయించండి చాలు. పెరుగు ని మజ్జిగ చేయండి .రెండు రోజులు సరిపోయేటట్టు ఉంటుంది. మొదటిరోజు అన్నంలో కలుపుకుని తింటే, రెండో రోజు మెంతి మజ్జిగ,లేదా మజ్జిగ చారు చేసుకుని కంది పచ్చడి గాని పెసర పచ్చడి గాని చేస్తే అద్భుతః !ఇంకొకరోజు సుబ్బరంగా చింతపండు పులిహార చేసి కాస్త గోధుమ రవ్వతో హల్వా చేస్తే సరి !ఇంకొకరోజు శెనగలు గాని ,బొబ్బర్లు గాని నానబెట్టుకుని కూర చేసుకుని, చారు పెట్టుకోవచ్చు. ఇలా కొంచెం ఆలోచిస్తే బోల్డన్ని వంటకాలు! కూరగాయల కోసం ఎగబడి పోకుండా, ఒక వారం నుంచి పది రోజుల పాటు హ్యాపీగా ఉండొచ్చు .మా పిల్లలు తినరు ,మా ఆయన తినడు అని అనుకుంటూ మార్కెట్లోకి ఎగబడి లేనిపోని తంటాలు తెచ్చుకుని బాధపడే బదులు ఇంట్లో వాళ్లకి నచ్చజెప్పి ఇంట్లో ఉండే ఈ సరుకుల తోటి వంట ముగించుకో వచ్చు. మనం ఇలా చేస్తే ఏరోజుకారోజు కొనుక్కోనే పేదవాళ్ళకి సరుకులు దొరికే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మన ఇంట్లో ఉంటాయి. ఎందుకంటే ఇంకా పూర్తిగా నెలాఖరు అవ్వలేదు కదా ! అందుకని .మధ్యతరగతి వాళ్ళం, పిల్లలకి నచ్చ చెపుతూ ,పెద్దవాళ్ళకి పాత, చిన్నప్పటి రోజులు గుర్తుకు తెస్తూ ఇలాంటి వంటలు చేద్దాం. అసలైన  సంగతి మర్చిపోయా నండోయ్ మన తెలుగు మహిళ చేతిలో ఎప్పుడూ ఉండే ఎవర్ గ్రీన్  వంటలు,  కంది పొడి ,కరివేపాకు పొడి, నువ్వుల పొడి ఇవన్నీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి కలుపుకుని తింటే చాలా చాలా బాగుంటుంది .పిల్లలకి కొత్త రుచులు చెప్పండి. పెద్దలకి మరిచిపోయిన రుచులు గుర్తుకు తెండి .వారం రోజుల పాటు ఇంట్లో నుంచి కదలక్కర్లేదు .తరవాత ఎలాగో కొంచెం ఉధృతం తగ్గుతుంది కాబట్టి బయటకు వెళ్లి మనకి కావలసనవి ఒక వారం పది రోజులకు సరిపడా తెచ్చుకోవచ్చు. ప్రాణాల కన్నా ఏదీ ఎక్కువ కాదు కదా !మా పిల్లలకి ఇవి ఇష్టం ఉండవు, ఎప్పుడూ తినలేదు ,నాకు చేత కాదు, ఈ కబుర్లు చెప్పే బదులు పిల్లలకి నచ్చజెప్పి తినిపించడం లో ఉన్న మజా అందరం అనుభవిద్దాం !ఒక వారం రోజులు కూరగాయలు పళ్ళు తినక పోయినంత మాత్రాన ఏమీ జరగదు. కాబట్టి ఇవి ఆలోచించి ఆచరించి చూడండి.
🙏💐🌳  🌳💐🙏