corona debba

కరోనా కాటుకు.. చైనా దెబ్బ!!!
నవ్వులాటగా అనిపించవచ్చు కానీ.. జరిగింది ఇదే. 
1. కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా. ఇప్పటిదాకా ముందుజాగ్రత్త వ్యాక్సిన్ కానీ, రోగం వచ్చాక నయం చేసే ఔషధం కానీ తయారు కాలేదు. ప్రపంచమంతా తలపట్టుకు కూర్చుంది.
2. కాస్త ముందుకెళితే, కొన్ని నెలలు ముందుకెళితే.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాపై ఆర్థికయుద్ధం ప్రకటించారు. చైనాను టార్గెట్ చేసుకొని వాణిజ్య ఆంక్షల దిశగా అడుగువేశారు. బూమరాంగ్ అయింది. వైట్ హౌస్ కి వచ్చిన కొత్తలో మెక్సికో బెదిరిపోయినట్టు చైనా తొణకలేదు, బెణకలేదు, బెదిరిపోలేదు. జాతి విద్వేషంతో అధికారం చేపట్టి, జాతుల మధ్య వైరాన్ని రాజేసిన ది ప్రెసిడెంట్ ను పిచ్చికుక్క అనుకున్నది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ వేయాలనుకున్నది. కరోనా వైరస్ ను జేబులోంచి బయటికి తీసింది. ప్రపంచం మీదకు వదిలింది.
3. తాంబూలం ఇచ్చేశాను.. తన్నుకు చావండి అనేసింది చైనా. పుట్టినిల్లు చైనా.. ఇవాళ కరోనా వైరస్ చూసి భయపడడంలేదు. గుండె నిబ్బరంగా వుంది. ఈపాటికే వ్యాక్సిన్, మందు కూడా తయారు చేశారేమో తెలియదు.
4. ఆర్కిటిక్, అంటార్కిటికా లాంటి ఖండాలు తప్ప ప్రపంచమంతా కరోనా పేరు వింటేనే వణికిపోతోంది. ఏం చేయాలో, ఎలా బయటపడాలో ఎవరికీ తెలియని పరిస్థితి. కరోనా కారణంగా చైనాలో మరణించిన వారి సంఖ్యను ఇటలీ ఎప్పుడో అధిగమించింది.
5. అగ్రరాజ్యం అమెరికా నిలువెల్లా వణుకుతోంది. భద్రతా మండలి దేశాలు వణుకుతున్నాయి. ఇంకెంత... ఇంకొక్క అంగ వేస్తే మనదీ అగ్రరాజ్యమే అని దశాబ్దాలుగా ముందడుగు వేస్తూనే వున్న భారతదేశంలాంటి దేశాలూ చెట్టూపుట్టలు పట్టుకు తిరుగుతున్నాయి.
6. కానీ.. చైనాలో కరోనా ప్రభావం గురించి మీడియాలో ఒక్క వార్త వుండడంలేదు. గమనించారా? పుట్టినింట్లో అది దాదాపు మటుమాయమైంది. మొదటి ఫోటోని గమనిస్తే.. గత నెల రోజుల్లో అంతర్జాతీయంగా అనేక దేశాల మార్కెట్లు ఎంత నష్టపోయాయో తెలుస్తుంది. కానీ, చైనా మార్కెట్ లాభాల్లో వుంది.. అది ఎంత స్వల్ప శాతమైనా సరే.. గమనించదగ్గ, పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిణామం.
7. ఇవాళ ట్రంప్ ఏమంటారంటే.. కరోనా గురించి మాకు ముందుగా చెప్పకపోవడం చైనా చేసిన తప్పిదమని! అమెరికా నిఘా యంత్రాంగం కూడా ఘోర పరాజయం పొందిందన్న మాట!!
8. చైనా గడ్డపై నిలబడి వ్యాపారాలు చేసుకుంటూ.. ఆ సంస్థలు పరాయీకరణ అవుతున్నప్పుడు కరోనా బయటపడింది. ఇప్పుడు చైనా గడ్డమీది సంస్థల యాజమాన్య హక్కులు మళ్లీ చైనీయులకే దఖలుపడ్డాయి. ఈ పరిణామాన్ని జీర్ణించుకోవడం వైట్ హౌస్ కి చాలా చాలా కష్టం. ఇతర దేశాల వాళ్లు ప్రవేశించడానికి ఆస్కారం లేని గట్టి కోట గోడ కట్టుకుందామని అనుకున్నది అమెరికా. తాజా పరిణామాల నేపధ్యంలో  చైనా గోడను మరింత దుర్భేధ్యం చేసుకోవడానికి బీజింగ్ సంకల్పిస్తే అమెరికా ఎక్కడ వుంటుంది? ప్రపంచ దేశాలు ఎక్కడ వుంటాయి? కుప్పతొట్టిని కెలికింది అమెరికా. చైనానేమో ప్రపంచాన్నే కెలికింది.
9. దీని పర్యవసానాలు ఎలా వుంటాయో నా ఊహకు అందడం లేదు.
10. కానీ.. ఇదొక ప్రపంచ యుద్ధం. మూడవ ప్రపంచ యుద్ధం. అందులో ఇసుమంత సందేహం లేదు. ఆయుధాల వినియోగం అవసరంలేని భీకరమైన యుద్ధం. వార్ అంటే ప్రాణనష్టం ఒక్కటే ప్రామాణికం కాదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల్లో ఎంతమంది చనిపోయారు, ఇప్పుడు ఎంతమంది చనిపోయారు అనేది అస్సలు ప్రామాణికం కాదు. యుద్ధం తన స్వరూపాన్ని, స్వభావాలను మార్చుకుంటూ వస్తోంది. ఆ పరిణామక్రమం లేకపోతే అది ఆటవిక యుద్ధం అవుతుంది కానీ, ఆధునిక యుద్ధం కాజాలదు.
11. రెండు దేశాల మధ్య కేవలం సెంటిమెంటుతో యుద్ధాలు జరగవు కాక జరగవు. బలమైన ఆర్ధిక కారణాలు లేకుండా రెండు దేశాల యుద్ధాలు, అంతెందుకు.. అంతర్యుద్ధాలు కూడా జరగవు. ఒక ప్రపంచ యుద్ధం అంటే.. రెండు పక్షాలుగా అందరూ, ప్రతి ఒక్కరూ, ప్రతిదేశం.. గిరికి అవతలో, ఇవతలో నిలబడవలసిన సందర్భం. నేను తటస్థుడిని, ఈ యుద్ధం గిద్ధం లాంటికి నేను అతీతుడిని.. అని ఏ దేశం అన్నా అంటే అదొక తొర్రికూత మాత్రమే.
12. మన కళ్లెదురుగా వున్న రెండు ప్రపంచ యుద్ధాలకు నేపధ్యం బలమైన ఆర్ధిక కారణాలే. ఎవరన్నా లీడర్లకు మాటామాటా తేడా వుండొచ్చేమో కానీ.. అవి రెండూ ఎమోషనల్ యుద్ధాలు కావు. ఈ మూడో ప్రపంచ యుద్ధం.. నిశ్చయంగా ఈ మూడవ ప్రపంచ యుద్ధానికి నేపధ్యం బలమైన ఆర్ధిక కారణాలే. ఆ బలమైన ఆర్ధిక కారణాల పునాదులు లేకపోతే డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థి అయ్యేవాడు కాదు, అమెరికన్లు అతనిని గెలిపించుకునేవారూ కాదు. తెలుగునేలపై ఎవరికి ఇష్టం వున్నా లేకున్నా, ఏ కులపోళ్లు ఎవరిపక్షం వహించినా.. మనకు ఇష్టం వున్నా లేకపోయినా గెలిచేది మాత్రం ట్రంపునే అని గడచిన ఎన్నికలకు పూర్వం నిర్ద్వంద్వంగా ప్రకటించి వున్నాను. నా అంచనా తప్పలేదు.
13. ఈ యుద్ధాన్ని ఎదుర్కోవడానికి భారతదేశం కత్తి దూయడానికి బదులు సందులు ఎదుర్కొంటోంది. రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు.. ఈ ప్రపంచయుద్ధంలో నిమిత్తమాత్రులే కానీ..  కీలకపాత్ర ధారులు కాదు, కాలేరు. యుద్ధానికి సన్నద్ధం విషయంలో తెలంగాణ సైన్యం చురుగ్గా వుందని, ఆంధ్రప్రదేశ్ సైన్యం చాలా చాలా వెనుకంజలో, చాలా పేలవంగా వుందని చాలా మంది బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఏపీలో క్రియాశీలత కొరవడడానికి రాజకీయ కారణాలు అనేకం.
14. ఎహె.. అసలు మనకేమీ కాదు. మనది ఎండదేశం. ఇక్కడ కరోనా పుట్టనే పుట్టదు, పుట్టినా వెంటనే గిట్టవక తప్పదు అని తెలంగాణ సీఎం చాలా రోజులుగా భరోసా ఇస్తున్నారు. ఇది కొంచెం ఆరోగ్య ధైర్యం ఇవ్వవచ్చు. 
15. కానీ, సౌదీ అరేబియాలాంటి అతి ఉష్ణ దేశాలలోనూ కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కాబట్టి పునరాలోచన చేయవలసిందే అని ప్రధాని నరేంద్ర మోడీ సున్నితంగా హెచ్చరించారు.
16. జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన ప్రసంగంలో చాలా ముఖ్యాంశాలు వున్నాయి. జాతి నిర్దేశక అంశాలు వున్నాయి. పేరు ఏదైనప్పటికీ.. ఆదివారం నాడు ప్రతి పౌరుడు స్వచ్ఛందంగా ‘గృహ నిర్బంధాన్ని’ పాటించుకోవాలని సారాంశం.
17. నిత్యావసర సరుకులకు కొరతలేదు, అక్రమ నిల్వలు చేస్తే తాట ఒలుస్తాం అని ప్రధాని ప్రకటించారు కానీ.. ఒక పానిక్ సిట్యుయేషన్ నెలకొని వుంది. కొద్ది రోజులైతే దుకాణాలన్నీ మూస్తారనే భయం జనసామాన్యంలో నెలకొంది. చిన్న చిన్న దుకాణాలకు హోల్ సేల్ నుంచి, డిస్ట్రిబ్యూటర్లనుంచి సరఫరాలు తగ్గిపోతున్న మాట వాస్తవం. భయం చుట్టుముడితే.. అన్ని దుకాణాల్లో సరుకులు నిండుకోవడానికి మార్చి 31 వ్యవధి కూడా అవసరం లేదు. వాజపేయి హయాంలో పూర్తిగా, సంపూర్ణంగా బలహీనపడిన, చచ్చుబడిపోయిన పౌరసరఫరా వ్యవస్థను.. ఏ క్షణాన్నయినా పునరుద్ధరించడానికి, పౌరులందరికీ ఆహార భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి వుందనే భరోసా కల్పించాలి. అంతేకానీ.. ఇంత సంక్షుభిత సమయంలోనూ మాల్స్ తెరిచే వుంచాం కదా అని మార్కెట్ శక్తులకు జనాన్ని ఎరవేయడం సమంజసం, సమర్ధనీయం కాదు.
18. జనసామాన్యానికి ఇప్పుడు కావాల్సింది ఆర్ధిక దిశానిర్దేశం కానీ గృహనిర్బంధాలు కాదు. దేశంకోసం సరిహద్దుల్లో ప్రాణత్యాగానికి సిద్ధమైన ఏ వీర జవానుకి తగ్గని విధంగా భారతదేశంలో 130కోట్ల మందీ త్యాగాలు చేస్తూనే వున్నాం. ప్రధాని మోడీగారి హితవచన ఆదేశానుసారం.. మరో రెండు నెలలు ఓపికపట్టి కడుపు మాడ్చుకోవడానికి భారతదేశపు ప్రతి పౌరుడూ ఎల్లవేళలా సిద్ధమే. కానీ.. ముప్పొద్దులా మీరు మేస్తూ, ముప్పొద్దులా మేపుతున్న కార్పొరేట్ శక్తులకు ఈ బక్కప్రాణులను బలి ఇవ్వడం మాత్రం ప్రమాద ఘంటిక మోగిస్తోంది.
19. బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ గారు తడిబట్ట కప్పుకుని పడుకున్నారు. ఈ దేశం ఏమైతే నాకేంటి.. నా మైండ్ దొబ్బిన పాలసీలన్నీ బడ్జెట్లో పెట్టానా లేదా అనే చింత తప్ప మరొక ఆలోచన లేదు.
20. నన్వెవడు అడగొచ్చాడు, నేను రిజర్వు బ్యాంకు గవర్నరును అనే సంగతే ఎవడికీ తెలియదు. కాబట్టి నేను సేఫ్ అనుకుంటాడు ఆర్బీఐ గవర్నర్.
21. నెల రోజులనుంచీ రక్తకన్నీరు కారుస్తున్న స్టాక్ మార్కెట్లకూ నాకూ ఏంటి సంబంధం అని సెబీ మడికట్టుకు కూర్చుంటుంది. నిజానికి రెండేళ్లనుంచీ కారుస్తున్న రక్తకన్నీరుని కొలవడానికి దానిదగ్గర గాజునాళిక లేదు.
22. ఐసర బజ్జా అని తెలుగువాళ్లు వాడుకునే ఓ పదప్రయోగం. క్రూడాయిల్ రేటు 70డాలర్లనుంచి 20డాలర్లకు పడిపోతే.. డైరెస్ట్ వినియోగదారులకు మూడు రూపాయల రాయితీని కుడి చేత్తో, ఎడమచేత్తో కాకుండా అరికాలితో విదిల్చి.. తొమ్మిది రూపాయలను సుంకాల రూపంలో బొక్కసంలో నింపుకున్న దొడ్డ ప్రభువు నరేంద్రమోడీ. ఆడపిల్లల ఒంటి వంపూ సొంపూ చూసి పన్నులు వేసిన నిజాం కిరాయి సైన్యానికీ, నరేంద్ర మోడీ పరిపాలనకూ నాకు పెద్దగా తేడా కనపడదు.
23. సరుకుల రవాణా, జీడీపీలు దివ్యంగా వెలిగిపోతున్నప్పుడే..  రవాణారంగానికి డైరెస్టుగా రాయితీలు బదిలీ చేయకుండా.. ఆ రంగం కునారిల్లేలా, కుప్పకూలేలా చేసిన భావజాలం.. ఇంత సంక్షుభిత సమయంలోనే అదే తీరులో పనిచేస్తుండడం శోచనీయం. ఒట్టిపోయిన రవాణా ఆవుని కూడా అమ్మకానికి పెట్టిన గొప్ప చక్రవర్తి ఈ గోమాయువు.
24. బత్తాయిలు... అవును బత్తాయిలు.. భక్తిరసం పిండడానికే అంకితమైన బత్తాయిలు.. సీజర్ భార్య తప్పు చేయదు, మోడీ తప్పు చేయడు. సీజర్ భార్య పిత్తుతుందేమో కానీ, మోడీ అయితే పిత్తను కూడా పిత్తడు అని వెర్రివెంగళాయప్పల్లా ప్రచారం చేస్తే.. భారతదేశం నాగపూర్ అంత చిన్నది కాదు. విశాలమైనది. విశిష్ట భావజాలం కలిగినది.
25. అది కాదు కానీ.. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగంలో అతి పెద్ద బత్తాయి ఎలిమెంట్ మిస్సయింది. ‘‘స్వచ్ఛ భారత్’’ కార్యక్రమాన్ని అంత:కరణ శుద్ధితో చేపట్టి అమలు చేసినందువల్లనే.. ఇవాళ మనం ధైర్యంగా వుండగలుగుతున్నాం. అమెరికాలాంటి మురికి దేశాల జాబితాలో చేరకుండా వుండగలుగుతున్నాం.. అని కూడా ఓ మాట అంటే ఎంత బావుండేది?
26. ఇంకా నయం.. చిరిగిపోతేనే అసలైన నోటు. రంగు వెలిస్తేనే నిప్పుసారా లాంటి నోటు. జనం చస్తేనే మనం వైరస్ ఎదుర్కొన్నట్టు లెక్క.. ప్రతి మృతుడితో ఒక చిప్ అమర్చుతున్నాం. ప్రయాణమార్గం మొత్తం మనకు తెలుస్తుంది. నేరుగా నరకానికి, స్వర్గానికి ఆరులైన్ల హైవే వేసి, టోలు గేటు పెట్టి.. భరతమాత రుణం తీర్చుకుంటా అనలేదు.